Andhra Pradesh

తిరుమల డిక్లరేషన్ వివాదం.. నా మతం ఇదే, కావాలంటే రాసుకోండి.. వైఎస్ జగన్ ఎమోషనల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని సెప్టెంబర్ 22న టీటీడీ ఈవో రిపోర్టు కూడా ఇచ్చినట్లు జగన్ తెలిపారు. అయితే ఇంత తెలిసినా కూడా చంద్రబాబు తిరుమల లడ్డూపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. టీటీడీ ఈవో రిపోర్టు తర్వాత కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఆ నెయ్యిని వాడేశారంటూ తిరుమల పవిత్రతను తగ్గించేలా అబద్ధాలు చెప్తున్నారని జగన్ విమర్శించారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు.

” మా నాన్న వైఎస్ఆర్ ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా. పాదయాత్రకు ముందు శ్రీవారి దర్శనం చేసుకున్నా. పాదయాత్ర పూర్తయ్యాక.. కాలినడకన తిరుమల కొండెక్కి వెంకన్న దర్శనం చేసుకున్నా. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియవా? చంద్రబాబుకు తెలియవా? ఆ తర్వాతే ముఖ్యమంత్రిని అయ్యా. సీఎం హోదాలో ఐదుసార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించా. నేను తిరుమల వెళ్లడం ఇదే తొలిసారి కాదు. పది, పన్నెండుసార్లు తిరుమలకు వెళ్లినవాడికి నోటీసులు ఇస్తారా?. ఈ రోజు నేను తిరుమలకు రాకూడదట, కారణం నా మతమట. నా మతం, కులం ఏంటో ప్రజలకు తెలియదా?. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా. బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తా. నా మతం మానవత్వం. కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోండి.. అంటూ జగన్ ఎమోషనల్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version