Telangana
వెంటపడిన పెంపుడు కుక్క.. మూడో అంతస్తు నుంచి పడి మరణం..

హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో పెంపుడు కుక్క వెంటపడటంతో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు ఉదయ్ (23) నివాసం ఉంటున్నాడు.
అతను ఆదివారం (అక్టోబర్ 20) స్నేహితులతో కలిసి చందానగర్ లోని వీవీ ప్రైడ్ అనే హోటల్‌కు డిన్నర్‌కి వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అతడికి ఓ పెంపుడు కుక్క కనిపించింది. ఉదయ్ దాన్ని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో కుక్క ఉదయ్ వెంట పడటంతో.. దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోటల్ కిటికీ నుంచి ఉదయ్ కిందపడిపోయాడు. గమనించిన స్నేహితులు కిందకు వెళ్లి చూడగా.. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు హోటల్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
అయితే ఆదివారం రాత్రి ఈ సంఘటన జరగ్గా.. విషయం బయటకు రాకుండా హోటల్ యాజమాన్యం జాగ్రత్త పడింది. ఇప్పుడు విషయం బయటపడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇక గతేడాది హైదరాబాద్‌లో ఇటువంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. కస్టమర్ కి చెందిన పెంపుడు కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి స్విగ్గీ డెలివరీ బాయ్ చనిపోయాడు. డెలివరీ ఇవ్వడానికి వెళ్లి కస్టమర్ పెంపుడు కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి తన ప్రాణాలు విడిచాడు. 23 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ స్విగ్గీ ఏజెంట్ బాయ్‌గా పనిచేస్తుండగా.. గతేడాది జనవరిలో బంజారాహిల్స్‌లోని లుంబిని రాక్ కాజిల్ అపార్ట్‌మెంట్స్‌లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు.
కస్టమర్ ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి తలుపు కొట్టాడు. ఇక కొత్త వ్యక్తి కావటంతో కస్టమర్ జర్మన్ షెపర్డ్ కుక్క రిజ్వాన్‌పై దాడి చేసింది. దాంతో భయపడిపోయిన రిజ్వాన్ దాన్నుంచి తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పైనుంచి పడి మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.