Connect with us

Andhra Pradesh

జగన్‌కు వరుస షాకులిస్తున్న రాజ్యసభ సభ్యులు

జగన్‌కు వరుస షాకులిస్తున్న రాజ్యసభ సభ్యులు, త్వరలో మరో ఐదు వికెట్లు డౌన్‌? ఎందుకిలా..

ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో ఐదుగురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా… అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితిని కొందరు ఎదుర్కొంటుండగా..

ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిపోవడంతో ఉక్కపోత పెరిగిపోయిందేమో… వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. రాజ్యసభలో హైస్పీడ్‌ చూపిద్దామనుకున్న అధినేతకు వరుస షాకులిస్తున్నారు. అయిన వారు… అనుచరులు.. అక్కున చేర్చుకుంటారని భావించిన వారు వరుసగా బైబై అంటున్నారు. ఇక మిగిలిన వారు అదే దారిన వెళ్దామనే ఆలోచనలో ఉన్నారట… ఇంతకీ మిగిలేది ఎందరు..?

జగన్‌కు వరుస షాకులిస్తున్న రాజ్యసభ సభ్యులు, త్వరలో మరో ఐదు వికెట్లు డౌన్‌? ఎందుకిలా..

ఒక్కొక్కరిగా వీడిపోతున్న ఎంపీలు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన వైసీపీకి… రాజ్యసభ సభ్యులే ఓదార్పుగా నిలుస్తారని అంతా భావించారు. టీడీపీ కూటమికి తిరుగులేనంత బలం ఉన్నా.. రెండేళ్ల వరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం లేదన్న ధీమాతో కేంద్రంలో తమకు ఎదురే లేదన్నట్లు భావించింది వైసీపీ అగ్ర నాయకత్వం.. తీరా రోజులు గడుస్తున్నకొద్దీ పార్టీ అధినేతకు షాక్‌ మీద షాక్‌నిస్తూ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే సీనియర్‌ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజ్యసభతోపాటు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా బీసీ ఉద్యమ నేత, ఆర్‌.కృష్ణయ్య కూడా రాం.. రాం.. చెప్పేశారు.

వైసీపీలో కలకలం రేపిన కృష్ణయ్య..
తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా అనూహ్యంగా ఎంపిక చేసిన వైసీపీకి… అంతే అనూహ్యంగా షాక్‌ ఇచ్చారు కృష్ణయ్య. మోపిదేవి, బీద మస్తాన్‌రావు పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో ఆర్‌.కృష్ణయ్య కూడా అదే ఆలోచనలో ఉన్నారని ఉహాగానాలు వినిపిస్తే.. తాను పార్టీ మారేది లేదని మీడియా ముఖంగా ప్రకటించిన కృష్ణయ్య… ఇప్పుడు ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా రాజీనామా చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది.

ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి..
ఇక కృష్ణయ్య రూట్‌లో ఇంకెందరు పార్టీని వీడతారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీకి 8 మంది రాజ్యసభ సభ్యులు మిగలగా, వీరిలోనూ కొందరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు… తమ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని అధికార పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో అధినేత జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డితోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, నిరంజన్‌రెడ్డి, రఘురామిరెడ్డి, గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. వీరిలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వంటివారు ఇంతకుముందే పార్టీ మారేది లేదని ప్రకటించారు. ఐతే ఆర్‌.కృష్ణయ్య కూడా ఇదే మాట చెప్పి రాజీనామా చేయడంతో మిగిలిన ఎంపీల్లో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు.

 

Loading