Connect with us

Andhra Pradesh

విజయవాడ దుర్గమ్మ హుండీకి భారీగా దసరా ఆదాయం.. 15 రోజుల్లో ఏకంగా కోట్లలో!

దసరా పండుగ సమయంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటూ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి హుండీకి ఆదాయం కూడా భారీగా వచ్చింది. 15 రోజుల్లో ఏకంగా రూ.3.5 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదిమాత్రమే కాదు విజయవాడ దుర్గమ్మ ఆలయానికి ఒకరోజు ఏకంగా రూ.85 లక్షల ఆదాయం రావడం విశేషం.

విజయవాడ దుర్గమ్మకు దసరా ఉ్సతవాల సమయంలో భారీగా ఆదాయం సమకూరింది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఆలయంలోని మహామండపం ఆరో అంతస్తులో హుండీల లెక్కింపు జరిగింది. 15 రోజుల్లో హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు 272 గ్రాముల బంగారం, 9.325 గ్రాముల వెండి వస్తువులను మొక్కుల రూపంలో దుర్గమ్మకు చెల్లించుకున్నారు.

అలాగే కానుకల్లో విదేశీ కరెన్సీ కూడా ఉంది. అందులో 285 USA డాలర్లు, 50 కెనడా డాలర్లు, 20 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 160 ఆస్ట్రేలియా డాలర్లు, 15 సౌది రియాల్స్, 6 సింగపూర్‌ డాలర్లు, 5 కువైట్‌ దీనార్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కొంతమంది భక్తులు కానుకల్లో అమ్మవారికి సమర్పించేందుకు నోట్ల దండను కూడా మొక్కు రూపంలో చెల్లించుకున్నారు. ఇక ఆలయంలో హుండీల లెక్కింపులను ఈవో రామరావు, డిప్యూటీ ఈవో రత్నంరాజు దగ్గరుండి మరి పర్యవేక్షించారు.

మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ధర్మపథం కార్యక్రమంలో భాగంగా.. కళావేదికపై ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను అలరించింది. ఇందులో విజయవాడకు చెందిన కళాకారిణులు గ్రీష్మప్రియ, సుధేష్ణ, హరిణి ప్రదర్శించిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. నృత్య ప్రదర్శన అనంతరం సిబ్బంది వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు.

Loading