Devotional

Vijaya Muhurtham జమ్మి చెట్టును ఎలా పూజించాలి? దసరా రోజున “విజయ ముహూర్తం” ఎప్పుడు?

దేవి నవరాత్రులో  ముఖ్యమైన రోజు విజయ దశమి పండగ.  ఆ రోజు విజయ ముహూర్తం చాలా ముఖ్యమైనది. మరి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? ప్రాముఖ్యత ఏంటి? జమ్మి పూజ ఎలా చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం..

ప్రతీ సంవత్సరం విజయదశమి రోజున.. విజయ ముహూర్తం ఉంటుంది. ఆ ముహూహ్తంలో.. పని ప్రారంభించి, అమ్మవారి మీద భారం వేసి నిజాయతీగా శ్రమిస్తే తప్పక విజయం సొంతం అవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది: 2024వ సంవత్సరం అక్టోబర్​ 12వ తేదీన శనివారం రోజు మధ్యాహ్న సమయంలో విజయ ముహూర్తం వచ్చింది. అంటే మధ్యాహ్నం 2:03 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2:49 నిమిషాల మధ్యలో విజయ ముహూర్తం ఉంది. ఈ సమయంలో మంచి పనిని ప్రారంభిస్తే సంవత్సరం అంతా అద్భుతమైన విజయాలు లభిస్తాయని అంటున్నారు.

జమ్మి చెట్టుకు పూజ ఏ విధంగా చేయాలి: విజయ దశమి రోజు జమ్మి చెట్టు వద్ద చేసే పూజ అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుందని అంటున్నారు. పూజ ఎలా చేయాలంటే..?

  • ముందుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి బియ్యప్పిండితో ముగ్గు వేసుకోవాలి.
  • ఆ తర్వాత మూడు తమలపాకులు పెట్టి  ఆ తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు పెట్టాలి. ప్రతి పసుపు ముద్దకు పైనా, కుడివైపు, ఎడమ వైపు కుంకుమ బొట్లు పెట్టాలి.
  • పసుపు ముద్దలకు పూలతో, అక్షింతలు పూజ చేస్తూ మంత్రం 21 సార్లు “ఓం అపరాజితాయై నమః” చదువుకోవాలి.
  • ఎడమ వైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ “ఓం జయాయై నమః” అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి. కుడి వైపున ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ “ఓం విజయాయై నమః” అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి.
  • కర్పూర హారతి ఇచ్చి ఒక్కో పసుపు ముద్ద దగ్గర బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. పూజ చేసిన తర్వాత ఆ మూడు పసుపు ముద్దలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసుకోవాలి.
  • ఆ తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకుని పసుపు, కుంకుమ బొట్లు పెట్టి కాగితం పైన ఓంకారం, స్వస్తిక్​ గుర్తు వేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు లో పెట్టాలి.
  • అనంతరం ఆ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓ శ్లోకం చదువుకోవాలి. “శమీ శమయతే పాపం శమీశతృ వినాశనమ్​ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ” అంటూ చదువుతూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ ఈ శ్లోకం చదవడం రాకపోతే ఓం అపరాజితా దేవ్యై నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.
  • ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులందరి మీద అపరాజితా దేవి అంటే రాజ రాజేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version