Telangana
తెలంగాణలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు వస్తున్నాయి. వాటిలో మొదటి ఎయిర్‌పోర్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకోండి.

తెలంగాణలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు వస్తున్నాయి. వాటిలో మొదటి ఎయిర్‌పోర్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకోండి.
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఇందులో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు తొందరగా పూర్తవ్వే అవకాశం ఉంది. దీనికి అధికారులు పని మొదలుపెట్టారు.
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం రాష్ట్రంలో పర్యటించి ఫీజిబిలిటీ నివేదికలు సిద్ధం చేసింది. కానీ, వివిధ కారణాలతో ఆ పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకోవడంతో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. వీటిలో వరంగల్ ఎయిర్‌పోర్టు ముందుగా పూర్తయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. మామునూరులో నిజాం కాలంలోనే ఎయిర్‌పోర్టు నిర్మించారు. అది మూతపడి 32 ఏళ్లు అయ్యింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు 696.14 ఎకరాల భూమి ఉంది. అయితే, విస్తరణ కోసం మరో 253 ఎకరాలు కావాలని ఏఏఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి అవసరమైన భూసేకరణ కోసం రేవంత్ సర్కార్ రూ.205 కోట్లు విడుదల చేసింది.
మొదటి దశలో మామునూరు ఎయిర్‌పోర్టును చిన్న విమానాల కోసం నిర్మించనున్నారు. అభివృద్ధి కోసం 8 నెలల గడువు పెట్టుకున్నారు. రెండో దశలో పెద్ద విమానాలు, కార్గో విమానాల కోసం విస్తరించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో మామునూరు ఎయిర్‌పోర్టుతో పాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వరంగల్ ఎయిర్‌పోర్టు ముందుగా పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది.
మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసే అవకాశం పరిశీలించడానికి ఏఏఐ బృందం పర్యటించింది. అయితే, ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవని గుర్తించారు. అందువల్ల ఈ ప్రాజెక్టులపై ప్రస్తుతం స్పష్టత లేనట్లు తెలుస్తోంది.