Telangana
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి: కుట్ర పన్నిన 55 మందిని అరెస్ట్, 3 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

వికారాబాద్ కలెక్టర్‌పై దాడి: కుట్ర పన్నిన 55 మందిని అరెస్ట్, 3 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. దాడి ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు గుర్తించిన పోలీసులు, ఈ ఘటన వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో లగచర్లలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ పరిధిలో లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ స్థాపనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సమావేశం సమయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడి జరపడం, పలువురు అధికారులకు గాయాలు అవడం, అలాగే వాహనాలు ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ దాడిలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ లు ఏ ప్రమాదం లేకుండా తప్పించుకోగా, అధికారులు వెంకట్‌రెడ్డిపై తీవ్రంగా దాడి జరగడంతో ఆయన గాయపడ్డారు. వెంకట్ రెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై కూడా దాడి జరిగింది.
ఈ దాడి పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రధాన నిందితుల కాల్ లిస్ట్‌లు పరిశీలించగా, సంచలనాత్మక అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించగా, మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ కేసు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బోగమోని సురేష్ పరారీలో ఉన్నారని సమాచారం, అతని ఫోన్ నుంచి బీఆర్ఎస్ నేతకు సుమారు 42 సార్లు కాల్ చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ నేతను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్టు సమాచారం.