Telangana

మద్యం అమ్మకాల్లో సత్తా చాటిన తెలంగాణ.. దేశంలో తెలంగాణనే టాప్..

మద్యం విక్రమాల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. తెలంగాణలో తాగటం ఓ వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ దసరా సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ అక్షరాలా నిజమని నిరూపిస్తున్నారు తెలంగావాసులు. ఇటీవలే.. దసరా పండుగకు మంచినీళ్లలా మద్యం తాగిన మందుబాబులు.. రికార్డు సృష్టించారు. కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (NIPFP) సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణలో పోయిన ఏడాది సగటున ఒక్కో వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా.. ఏపీలో మాత్రం రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గడ్‌లో రూ.1,227 ఒక్కో వ్యక్తి ఖర్చుచేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మద్యంపై తక్కువ ఖర్చు చేస్తున్నట్టు సర్వే రిపోర్టు పేర్కొంది. మద్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. 2022-23లో పశ్చిమ బెంగాల్‌లో సగటున ఓ వ్యక్తి మద్యంపై కేవలం రూ.4 మాత్రమే ఖర్చు చేసినట్లు సర్వే రిపోర్టు పేర్కొంది. దేశంలో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో.. ఒక్కో వ్యక్తి సగటున మద్యంపై ఏడాదికి రూ.49 మాత్రమే ఖర్చు చేస్తుండటం ఆశ్చర్యం.

తెలంగాణలో ఏ పండుగైనా, పార్టీ అయినా.. ఫంక్షన్‌ అయినా.. చావైనా, పుట్టుకైనా.. ముక్కతో పాటు చుక్క పక్కాగా ఉండాల్సిందే. ఇక ఎన్నికల్లో అయితే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మద్యం వరదలై పారుతుందన్ని బహిరంగ రహస్యమే. రాష్ట్ర ఖజానాకు అత్యధిక శాతం మద్యం నుంచే రాబడి వస్తుందంటా.. దీంతో.. మద్యంపై ఎక్కువ ఖర్చుచేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటిస్థానంలో నిలుస్తూ వస్తోంది.

తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. మరో వెయ్యి వరకు బార్లు, పబ్స్ ఉన్నాయి. ఈ మధ్య దసరా సందర్భంగా దాదాపు రూ.1,000 కోట్లకు పైగానే మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారిక లెక్కలు చూస్పిస్తున్నాయి. ఏకంగా 11 లక్షల మద్యం కేసులు, 18 లక్షల బీర్ల కేసులు విక్రయాలు జరిగినట్టు అబ్కారీశాఖ వెల్లడించింది. ఇక.. అనధికారికంగా ఇంకెంత మద్యం అమ్ముడుపోయిందని ఆ వైన్ షాపుల యజమానులకే తెలియాలి.

దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా బీర్ల విక్రయాలు జరుగుతున్నట్టు ఓ సర్వేలో తేలటం గమనార్హం. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బీర్లు తాగిన వారి సంఖ్య 302.84 లక్షలని.. ఏపీలో 16.9 లక్షల బీర్లు అమ్ముడైనట్టుగా సర్వేలో వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version