Connect with us

Telangana

హైకోర్టులో పిటిషన్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు..

హైకోర్టులో పిటిషన్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు..

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని.. జాతీయ కబడ్డీ ప్లేయర్, హేమంత్ నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం పై  విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association) కార్యవర్గానికి జరగనున్న ఎన్నికలను సవాల్ చేస్తూ.. నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖ జాతీయ కబడ్డీ ప్లేయర్ బసాని హేమంత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని హేమంత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో కల్పిత ఓటరు జాబితాను రూపొందించారని పిటిషనర్ ఆరోపించారు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్- 2011 ఉల్లంఘించటంతో పాటుగా.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎన్నికల ప్రక్రియలో పాటించటం లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారికి సరైన సమాచారం అందించలేదని.. ఎన్నికల లో తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారని హేమంత్ తన పిటిషన్‌లో వెల్లడించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు తాజాగా జరుగతున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. నిబంధనల ప్రకారం క్రీడా సంఘాల్లోని ప్రముఖ క్రీడాకారులను చేర్చుకోవాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై తాజాగా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ నగేష్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ కబడ్డీ అసోసియేష్‌తో పాటుగా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించలేమని.. అక్రమాలు రుజువైతే ఎన్నికలను పక్కన పెడతామని అన్నారు. ఈ మేరకు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయడానికి వీలుగా రెండు వారాల గడువిస్తూ న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.

కాగా, తెలంగాణ కబడ్డీ సంఘం ఎన్నికలు రేపు (అక్టోబర్ 27)న హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని కాసాని కృష్ణ ముదిరాజ్ కబడ్డీ అకాడమీలో జరగనున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో బాసాని హేమంత్.. ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికలను వాయిదా వేయటానికి కోర్టు నిరాకరించటంతో రేపటి ఎన్నికలు జరగనున్నాయి.

Loading