Connect with us

Telangana

హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ మోసం జరిగింది. సినీ ప్రముఖులతో ప్రకటనలు చేసి అమాయకులను మోసం చేశారు.

హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ మోసం జరిగింది. సినీ ప్రముఖులతో ప్రకటనలు చేసి అమాయకులను మోసం చేశారు.

హైదరాబాద్ నగరంలో ఇటీవల రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సామాన్య, మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా మరో మోసం బయటపడింది. “బైబ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్” పేరుతో అమాయకులను నమ్మించి రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వసూలు చేసి పారిపోయారు. దీనితో బాధితులు పోలీసుల వద్ద ఫిర్యాదు చేశారు.

ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినీ ప్రముఖులతో ప్రకటనలు చేయించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. సొంతిల్లు కలతో రూపాయి రూపాయి కూడబెట్టిన మధ్యతరగతి ప్రజలు ఆ ప్రకటనలు నమ్మి వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఈ అవకాశం చూసి కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారు సాధారణ ప్రజల నుంచి చాలా డబ్బులు తీసుకొని తర్వాత కనిపించకుండా పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది.  ఒక రియల్ ఎస్టేట్ సంస్థ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు పంచుతామని చెప్పి మోసం చేసింది. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత బాధితులు వేణుగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌శర్మ, కల్పన మీడియాతో మాట్లాడారు.

సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తి తమ దగ్గర డబ్బు తీసుకొని మోసం చేశారని బాధితులు ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో వెంచర్లలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించారని తెలిపారు. బైబ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వసూలు చేశారని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తర్వాత 24 శాతం ఎక్కువగా చెల్లిస్తామని ఎండీ శ్రీధర్ హామీ ఇచ్చారని చెప్పారు. కానీ, చెప్పిన సమయం పూర్తయ్యినా డబ్బు చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేశారని బాధితులు వాపోయారు.

తమకు లాభాలు అవసరం లేదని, కేవలం చెల్లించిన అసలు డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే, వారు అసభ్యంగా దూషించారని బాధితులు అన్నారు. అంతేకాక, తమపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు అడగగానే చెల్లని చెక్కులిచ్చి మూడేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఫిర్యాదులో చెప్పారు. సినీ ప్రముఖులతో టీవీలు, పేపర్లలో ప్రకటనలు చేయించడంతో వాటిని చూసి మోసపోయామని తెలిపారు. తమను మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Loading