Telangana
4 లైన్ హైవేకు గ్రీన్ సిగ్నల్.. ఆ జిల్లా కేంద్రం రూపం మారనుంది.

తెలంగాణలో రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషలో ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన హైదరాబాద్-విజయవాడ వైవే విస్తరణకు సిద్ధమయ్యారు.ప్రస్తుతం 4 వరుసల రహదారిని 6 వరుసలుగా విస్తరించనున్నారు. రాష్ట్రంలో మరికొన్ని రహదారుల విస్తరణకు కూడా అంగీకారం తెలిపారు. తాజాగా, నిజామాబాద్ జిల్లా రూపాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్, నాలుగు వరసల రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పట్టణంలోని వినాయక్‌నగర్ హనుమాన్ కూడలి నుంచి బస్వాగార్డెన్ మీదుగా దేవి థియేటర్ వైపునకు వెళ్లే బ్రిడ్జి వరకు కొత్త రహదారి నిర్మించనున్నారు. నాలుగు వరసలుగా ఈ రహదారి నిర్మించేందుకు రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ రహదారి నిర్మాణం కోసం రూ. 7.80 కోట్లు మంజూరు చేశారు. అలాగే, ప్రస్తుతం టెండరు ప్రక్రియ ముగిసింది. వినాయక్‌నగర్ నుంచి బస్వా గార్డెన్ మీదుగా దేవి థియేటర్ వైపు వెళ్ళే రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. సుమారు ఈ రోడ్డు 1.50 కి.మీ. ఉండగా.. వాహనాల రద్దీతో ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది.
ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. స్కూల్ సమయంలో బస్సులు, బైకులు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నాయి, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. బస్వా గార్డెన్ దాటిన తర్వాత ఉన్న టర్నింగ్‌లు కూడా చాలా ప్రమాదకరంగా మారాయి. రెండు వైపులా వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వస్తుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ రోడ్డు నిర్మాణానికి ప్రాతిపాదనలు వచ్చాయి.
అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో 4 లైన్ హైవే విస్తరిస్తే ట్రాఫిక్ కష్టాలు దూరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆమోదం ఇచ్చింది. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ఆర్‌అండ్‌బీ నిజామాబాద్ డీఈ ప్రవీణ్ వెల్లడించారు. రహదారి అందుబాటులోకి వస్తే పట్టణ ప్రజల కష్టాలు తీరిపోతాయని చెప్పారు.