Telangana
ఎట్టకేలకు హైదరాబాద్ SOT పోలీసులకు చిక్కిన కొరియోగ్రాఫర్ జానీ..

జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. మైనర్ మీద అత్యాచారం చేయడం, వేధించడంతో అతని మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన అసిస్టెంట్ పెట్టిన కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. ఐదేళ్లుగా ఆమె మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడట. మతం మార్చుకోమని బెదిరించాడట. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడట. చివరకు ఆమె బయటకు వచ్చి ఇలా తన మీద ఐదారేళ్లుగా చేస్తున్న అత్యాచార,వేధింపులపై ఫిర్యాదు చేసింది.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోన్న జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అసిస్టెంట్ కొరియాగ్రాఫర్‌గా ఉన్న తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షూట్ కోసం ముంబయికి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు బాధితురాలు చెప్పడం.. ఆ సమయంలో ఆమె మైనర్ కావడంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు కూడా నమోదైంది.
ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన కోసం నెల్లూరుతో పాటు నార్త్ ఇండియాలోనూ పలు బృందాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి జానీ మాస్టర్ బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలియడంతో హైదరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ కేసులో బాధితురాలికి టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. బాధితురాలికి అండగా ఉండటంతో పాటు తాను నటించే అన్ని సినిమాల్లోనూ అవకాశాలు ఇస్తానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక జానీ మాస్టర్ అలాంటివాడేనంటూ కొంతమంది చెబుతుండగా… ఇది జానీ మాస్టర్‌పై జరిగిన కుట్ర అంటూ కొంతమంది సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.