Telangana
జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీ..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టైన జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అంగీకరించింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ నెల 28న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ను విచారించనున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అత్యాచారం ఆరోపణలపై జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పోక్సో కేసు
హైదరాబాద్‌లో జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పీఎస్‌లో ఓ యువతి కంప్లైంట్ ఇచ్చింది. తనపై అత్యాచారం చేశాడని, బెదిరించి గాయపరిచాడని ఆరోపించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు. అవుట్ డోర్ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది.
14 రోజుల రిమాండ్
ఈ కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పరపల్లి పోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో ఉన్నారు. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలనే కొందరు తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీ నిరూపించుకుంటానన్నారు. తనను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని జానీ మాస్టర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.