Andhra Pradesh

తిరుమల లడ్డూ విచారణలో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టు విచారణ వాయిదా

ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ వివాదం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన ఈ న్యాయస్థానం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ జరిగిందా లేదా నిర్ధారించకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా ప్రకటన చేస్తారని.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా గురువారం మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. శుక్రవారానికి వాయిదా వేసింది.

తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మాసనం.. విచారణను రేపటికి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ విచారను కొనసాగించాలా లేక సీబీఐ తరహాలో స్వతంత్య్ర దర్యాప్తు సంస్థకు విచారణను అప్పగించాలా అని ఇప్పటికే కోర్టు ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ దర్యాప్తుపై అభిప్రాయం తెలిపేందుకు ఇంకొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరగా.. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ స్పష్టం చేసింది. ఇక ఈ వివాదంలో పిటిషనర్ సుబ్రమణ్యస్వామి రేపు స్వయంగా విచారణకు హాజరై వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారన్న ఆరోపణలపై లోతుగా విచారణ చేస్తామని.. అదే సమయంలో ఇరు పక్షాల వాదనలను కూడా వింటామని ధర్మాసనం చెప్పింది. ఇక ఇదే లడ్డూ వ్యవహారంపై సుబ్రమణ్యస్వామితోపాటు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా సురేష్ చావ్‌హంకే, డాక్టర్ విక్రమ్ సంపత్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. తాజాగా విచారణను వాయిదా వేసింది.

తిరుపతి లడ్డూ వ్యవహారంపై విచారణ సమయంలో.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం ప్రకటన చేయడంపై సీరియస్ అయింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అసలు వాడారో లేదో తెలుసుకోకుండా ఎలా ప్రకటన చేస్తారంటూ గట్టిగ నిలదీసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని స్పష్టంగా చెప్పింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కోర్టు ప్రశ్నలు అడిగింది. కల్తీ జరిగిందని చెప్పుకొచ్చిన నెయ్యి ఎక్కడి నుంచి సేకరించారని.. లడ్డూ తయారీకి ఆ నెయ్యిని ఉపయోగించారని ఆధారాలు ఏంటని కోర్ట్ ప్రశ్నించింది. అంతేకాకుండా అసలు నెయ్యిని పరీక్షలకు ఎప్పుడు పంపారు.. లడ్డూలను తిని మీరు చూశారా.. లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా.. అంటూ వరుస ప్రశ్నలు అడిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version