Sports
IND vs BAN 1st Test: ముగిసిన మూడో రోజు ఆట..

చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అయితే, వెలుతురు సరిగా లేకపోవడంతో 9 ఓవర్లు ఉండగానే ఆటను నిలిపేశారు. నజ్ముల్ హుస్సేన్ శాంటో 51 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కాగా, మూడో రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్‌కు 515 పరుగుల టార్గెట్ నిలిచింది.
రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ముష్ఫికర్ రహీమ్, షాద్‌మన్ ఇస్లాం, మోమినుల్ హక్‌లను అశ్విన్ అవుట్ చేశాడు. మోమినుల్ 13 పరుగులు, ఇస్లాం 35 పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా బంగ్లా బ్యాటర్ జకీర్ హసన్‌ను ఔట్ చేశాడు. జకీర్ 33 పరుగులు చేశాడు.
భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అజేయంగా 119, రిషబ్ పంత్ 109 పరుగులు చేశారు. వీరిద్దరూ కాకుండా కేఎల్ రాహుల్ 22 నాటౌట్, విరాట్ కోహ్లీ 17, యశస్వి జైస్వాల్ 10, రోహిత్ శర్మ 5 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో మెహదీ హసన్ మిరాజ్ 2 వికెట్లు తీశాడు. నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్ 1-1 వికెట్లు తీశారు.