Sports
IND vs BAN 1st Test: సెంచరీలు బాదేసిన గిల్, పంత్..

బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు రిషబ్ పంత్, శుభమన్ గిల్ సెంచరీలు బాదేశారు. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 33తో బ్యాటింగ్ కొనసాగించిన శుభమన్ గిల్ 161 బంతుల్లో 100 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ కేవలం 124 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. దాంతో 81/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 64 ఓవర్లలో 287/4తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 227 పరుగుల్ని కలిపితే.. మొత్తం 515 పరుగుల టార్గెట్ బంగ్లాదేశ్ ముందు నిలిచింది.
ఈరోజు 12 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన రిషబ్ పంత్ తొలి సెషన్ నుంచే టాప్ గేర్‌లో ఆడేశాడు. ఈ క్రమంలో 128 బంతుల్లో 13×4, 4×6 సాయంతో 109 పరుగులు చేసి టీమ్ స్కోరు 234 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో రిషబ్ పంత్‌కి ఇది 6వ సెంచరీకాగా.. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ధోనీ సరసన సగర్వంగా నిలిచాడు. కారు యాక్సిడెంట్ తర్వాత 16 నెలలు టెస్టు క్రికెట్‌కి దూరంగా ఉన్న పంత్.. రీఎంట్రీలోనే సెంచరీ సాధించడం విశేషం.
ఈ చెపాక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన శుభమన్ గిల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన గిల్ 176 బంతుల్లో 10×4, 4×6 సాయంతో 119 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి సెషన్‌లో పంత్‌తో కలిసి భారీ సిక్సర్లు బాదిన గిల్.. పంత్ ఔట్ తర్వాత కాస్త నెమ్మదించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ సెంచరీ తర్వాత కాసేపటికే భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు.