Business
Sam Altman: 7 ఏళ్ల క్రితం బుక్ చేసినా టెస్లా కారు రాలేదు – ఓపెన్‌ఏఐ సీఈఓ పోస్ట్ వైరల్
 
																								
												
												
											ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ 7 సంవత్సరాల క్రితం బుక్ చేసిన టెస్లా కారు ఇంకా డెలివరీ రాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీపై అసహనం వ్యక్తం చేస్తూ ఆయన పోస్ట్ చేసిన వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డ్రైవర్‌లెస్ కార్లలో ముందంజలో ఉన్న టెస్లా కంపెనీ కార్లు సాధారణంగా ముందస్తు బుకింగ్‌లతోనే అందుబాటులోకి వస్తాయి. కానీ ఏడేళ్ల తర్వాత కూడా కారు అందకపోవడంతో శామ్ ఆల్టమన్ నిరాశ వ్యక్తం చేశారు.
2018లో టెస్లా కారును బుక్ చేసినట్లు ఆయన షేర్ చేసిన స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. ఏడేళ్లుగా డెలివరీ రాకపోవడంతో తాను చెల్లించిన 50 వేల డాలర్లను రీఫండ్ చేయాలని టెస్లా కంపెనీకి మెయిల్ చేసినట్లు తెలిపారు. టెస్లా నుంచి “బుకింగ్ నిర్ధారణ మెయిల్ అందుబాటులో లేదు” అని సమాధానం రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. “కారు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాను కానీ 7.5 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ” అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు టెస్లాపై విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు కూడా తమకు ఎదురైన ఆలస్యాల గురించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏ మోడల్ కారు బుక్ చేశారో ఆల్టమన్ స్పష్టంగా వెల్లడించలేదు. కానీ టెస్లా రోడ్‌స్టర్ మోడల్ కావచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మోడల్ ఉత్పత్తి 2020లో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అనేక సార్లు వాయిదా పడింది.
ఇక ఎలాన్ మస్క్ గత సంవత్సరం ఇన్వెస్టర్ల సమావేశంలో రోడ్‌స్టర్ కారు అభివృద్ధి చివరి దశలో ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశముందని తెలిపారు. అయితే శామ్ ఆల్టమన్ చేసిన ఈ వైరల్ పోస్ట్‌పై టెస్లా కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో టెక్ ప్రపంచం ఈ విషయంపై ఆసక్తిగా చర్చిస్తోంది.
 

