Andhra Pradesh

త్వరలోనే ఏపీలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్.. ఎక్కడంటే..!

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( శాప్) ఛైర్మన్ అనిమేని రవి నాయుడు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు నర్సింహ యాదవ్‌తో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిశారు. సరికొత్త ప్రణాళికలతో రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం కోసం నూతన క్రీడా పాలసీ తెచ్చినట్లు చెప్పారు.

ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించిన నూతన క్రీడా పాలసీలోని కొన్ని అంశాలపై మాట్లాడుకున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఈ సమావేశంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ కాంప్లెక్స్ నిర్మాణం కోసం అవసరమయ్యే 32 ఎకరాల భూ సేకరణకు సహకారం అందించాల్సిందిగా శాప్ ఛైర్మన్ రవి నాయుడు.. తిరుపతి జిల్లా కలెక్టర్‌ను కోరారు. అలాగే స్మార్ట్ సిటీ నిధుల సాయంతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునరుద్ధరణ పనులకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో శ్రీకాళహస్తి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చుట్టూ కాంపౌండ్ వాల్స్ నిర్మాణం గురించి కూడా చర్చించారు.

మరోవైపు ప్రపంచ స్థాయిలో మన రాష్ట్ర, దేశ ఖ్యాతిని పెంచే శక్తి క్రీడలకు ఉందన్న తిరుపతి కలెక్టర్.. తిరుపతిని క్రీడలకు ప్రధాన గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో నూతన క్రీడా విధానంకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో అవసరమైన క్రీడా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించడంలో పూర్తి సహాయాన్ని అందిస్తామని తిరుపతి కలెక్టర్.. శాప్ ఛైర్మన్‌కు తెలిపారు. అలాగే ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించే క్రీడాకారులకు రాష్ట్రం నుంచి అందించే ప్రోత్సాహకాలను కూడా భారీగా పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version