Telangana

హైదరాబాద్‌లో చెత్త బుట్టలో రూ.4 లక్షల విలువైన బంగారు నగలు..

హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంగారు నగలు మాయమవడం కలకలం రేపింది. బీరువాలో నగలు కనిపించటం లేదని సమాచారం అందించగా, అక్కడికి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఇంటి వరండా ఆవరణలో ఉన్న చెత్తబుట్టలో బంగారు నగలు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ నగలు అక్కడెవరు పెట్టారు అనేది ప్రశ్నగా మిగిలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసారాంబాగ్‌ డివిజన్‌ ఇందిరానగర్‌ ప్రాంతంలో ఓ కుటుంబం చాలా ఏళ్లుగా అద్దెకు ఉంటోంది. కుటుంబ పెద్ద ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉంటున్నాడు. అతడి ఇంట్లో అతని భార్య, రెండున్నరేళ్ల పాప, అత్త, బావమరిది ఉన్నారు. నవంబర్ 10, ఆదివారం ఉదయం బీరువా ఓపెన్ చేసి చూడగా బంగారు నగలు కనిపించలేదు. వెంటనే డయల్ 100కు కాల్ చేసి తమ ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలు కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు.

మలక్‌పేట ఏసీపీ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్‌ఐలు ఇంట్లో వెతికారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటి వరండాలో ఉన్న చెత్తబుట్టను పరిశీలించారు. అందులో ఆ నగలు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ నగలు అక్కడికి ఎలా వచ్చాయనేది ప్రశ్నగా నిలిచింది. ఎవరైనా కావాలనే అందులో వేశారా..? లేక చూసుకోకుండా చెత్తబుట్టలో వేశారనేది అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

గతేడాది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ చెత్తబుట్టలో బంగారం ప్రత్యక్షమైంది. రూ.56 లక్షల విలువైన బంగారం చెత్తబుట్టలో కనిపించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. చెత్తబుట్టలో బంగారాన్ని దాచి అక్రమంగా ఎయిర్‌పోర్టు దాటించే ప్రయత్నం చేయగా.. అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version