Telangana
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు.. మంత్రి కోమటిరెడ్డి ముఖ్యమైన ఆదేశాలు..

తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్రంలో రెండో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతుండగా, చివరకు దానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఉన్న అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయం నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త ఎయిర్‌పోర్టును స్వయంగా నిర్మించాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. అనుమతులు, ఇతర అధికార ప్రక్రియలను ఆరు నెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవడానికి సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో మామునూరు విమానాశ్రయం పనులపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం వేగవంతం చేసి త్వరతిగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్‌లో మామునూరు విమానాశ్రయంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఓసారి ఎయిర్‌పోర్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ కొత్త ఎయిర్‌పోర్టును ఉడాన్ పథకంతో జోడించి, ఇతర పెద్ద పట్టణాలకు రాకపోకలను సులభంగా చేసేందుకు సూచించారు.
మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్‌లో రామప్ప, భద్రకాళి, వెయ్యి స్థంబాల ఆలయాలు, కాకతీయ కట్టడాలు, టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రదేశాల అవసరాలకు మామునూరులో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం ఉండాలని చెప్పారు. త్వరలోనే తాను ఎయిర్‌పోర్టు పనులను పరిశీలిస్తానని చెప్పారు. కాగా.. మమూనూరు కొత్త విమానాశ్రయానికి 1000 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలో ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తండగా… త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది.