Telangana

తమ్ముడు చేసిన మోసం.. తన పిల్లలతో సహా ఆత్మహత్య..

సిద్దిపేట టౌన్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ్ముడి మోసానికి మనస్తాపం చెందిన ఓ అన్న తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా దాడి చేయటంతో తీవ్ర మనోవేదనకు గురై తనువు చాలించాడు. దీంతో మృతుని కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం అనే వ్యక్తి అతని సోదరుడు శ్రీనివాస్‌, తల్లి లచ్చవ్వతో కలిసి సిద్దిపేట టౌన్‌లోని వివేకానందనగర్‌ కాలనీలో ఇంటిని నిర్మించుకొని స్థిరపడ్డారు. సత్యం మొదటి భార్య స్వరూప పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో 2016లో పట్టణానికి చెందిన శిరీషను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు.

సత్యం, శిరీష దంపతులకు కుమారుడు అన్విష్‌ నందన్ (8), కుమార్తె త్రివర్ణహాసిని (6) సంతానం. కాగా సత్యం తన తమ్ముడు శ్రీనివాస్‌కు రూ.లక్షన్నర అప్పు తెచ్చి ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేశాడు. ఆ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరానికి మరో రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బుల విషయమై గతకొన్ని రోజులుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శ్రీనివాస్‌ తన భార్య, తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు. అయితే సత్యం గతేడాది క్రితం అనారోగ్యానికి గురయ్యారు. తన సర్జరీకి రూ.9.80 లక్షలు ఖర్చయ్యాయని.. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. గతంలో తాను ఇచ్చిన డబ్బు మొత్తం రూ.5.50 లక్షలు తిరిగి ఇవ్వాలని నెలరోజుల కిందట శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి అడిగాడు.

తీసుకున్న అప్పు ఇచ్చేందుకు శ్రీనివాస్‌ నిరాకరించాడు. తాను ఇవ్వలేనని.. దుర్భాషలాడి అతడిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సత్యం తన ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం (నవంబర్ 9న) సాయంత్రం పట్టణ శివారులోని చింతల్‌ చెరువు వద్దకు చేరుకున్నాడు. తమ చావుకు తమ్ముడు శ్రీనివాసే కారణమంటూ ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అలానే సూసైడ్‌ నోట్‌ను సైతం రాసి బైక్ కవర్‌లో పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యం భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version