Telangana
హైదరాబాద్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..

హైదరాబాద్‌లో మంగళవారం (నవంబర్ 19) రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మాదాపూర్ సిద్దిక్ నగర్‌లోని ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, భవనంలో నివసిస్తున్నవారిని అప్రమత్తం చేయడంతో వారు తీవ్ర భయాందోళనలో బయటికొచ్చారు. అప్పుడు చుట్టుపక్కన ఉన్న ప్రజలు కూడా భయంతో టెన్షన్ పెరిగింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు.
పక్కకు ఒరిగిన భవనం సమీపంలో కొత్త నిర్మాణం చేపడుతున్నప్పుడు పెద్దగా గుంతలు తీయడంతో, అది భవనాన్ని ఒరిగేలా చేశాయనేది అంచనాలు. అయితే, ఈ ఐదంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒరిగింది కాబట్టి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం చుట్టూ ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయించి, అక్కడి ప్రజలను భద్రతగా తరలించారు. GHMC సిబ్బంది కూడా ఈ చర్యల్లో పాల్గొన్నారు, అలాగే హైడ్రా కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.
భవనం పక్కకు ఒరిగిన ఈ వార్త క్షణాల్లోనే నగరమంతా వ్యాపించడంతో స్థానికులు ఆ భవనాన్ని చూసేందుకు వెళ్లారు. కొంతమంది వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
అయితే, ఈ భవనం పక్కకు ఒరిగిన కారణం ఏమిటి? అది పక్కన జరుగుతున్న నిర్మాణం వల్లేనా, లేక పునాదులు, పిల్లర్లు లేకుండా నిర్మించడంతోనా, లేక స్థల నిర్మాణ నిబంధనలు పాటించకపోవడంతోనా, లేదా భూమి కుంగిపోయి ఈ ప్రమాదం జరిగిందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, నిజమైన కారణాలను తేల్చాల్సి ఉంది.