Latest Updates

రజినీకాంత్ రియాక్షన్..దళపతి విజయ్ టీవీకే మహనాడుపై కీలక వ్యాఖ్యలు

రజినీకాంత్ రియాక్షన్..దళపతి విజయ్ టీవీకే మహనాడుపై కీలక వ్యాఖ్యలు

తమిళనాట దళపతి విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి మొదటి మహానాడు విజయవంతం అయ్యింది. అయితే, ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయ పార్టీల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. కానీ విజయ్ స్పందిస్తూ, నిర్మాణాత్మకమైన విమర్శలకే స్పందిస్తానని, విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో, సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా టీవీకే మహానాడుపై స్పందించారు. మరి తలైవా రజినీకాంత్ మహానాడుపై ఏమన్నారు?

తమిళ రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో దళపతి విజయ్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ తన కొత్త పార్టీ తమిళ వెట్రి కళగం (టీవీకే)ని స్థాపించారు. ఇటీవల టీవీకే మొదటి మహానాడును విల్లుపురంలో నిర్వహించారు. ఈ మహానాడుకు లక్షల మంది ప్రజలు, విజయ్ అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, విధానాలను వివరించారు. అయితే తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు విజయ్ మరియు టీవీకే సిద్ధాంతాలపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఈ మహానాడుపై స్పందించారు. తమిళ వెట్రి కళగం మహానాడు పెద్ద విజయం సాధించిందని రజనీకాంత్ చెప్పారు.

రజనీకాంత్ ఇటీవల టీవీకే పార్టీ నిర్వహించిన మొదటి మహానాడు గురించి మాట్లాడుతూ, అది భారీ విజయం సాధించిందని ప్రశంసించారు. దీపావళి పండగ సందర్భంగా తన అభిమానులు చెన్నైలోని పోయెస్ గార్డెన్ వద్ద రజనీకాంత్‌ను కలవడానికి తెల్లవారుజాము నుంచే చేరుకున్నారు. ఉదయం 9.30కు తలైవా బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి, దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. రజనీకాంత్‌ను చూసి అభిమానులు “తలైవా, తలైవా” అంటూ ఆనందించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరోవైపు, మీడియా టీవీకే మహానాడుపై ప్రశ్నించగా, అది నిజంగా విజయవంతమైందని, దళపతి విజయ్‌కి శుభాకాంక్షలు అని రజనీకాంత్ తెలిపారు. రజనీకాంత్ మద్దతు ప్రకటించడంతో దళపతి ఫ్యాన్స్, టీవీకే పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

నవంబర్ 1న తమిళనాడు డే సందర్భంగా దళపతి విజయ్ ట్వీట్ చేశారు. చారిత్రక స్మృతులతో ఈ రోజును ఘనంగా జరుపుకుందాం అని తమిళులకు పిలుపునిచ్చారు. 1956లో భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా నవంబర్ 1న తమిళనాడు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని విజయ్ చెప్పారు. మద్రాసు రాష్ట్రానికి తమిళనాడు అని పేరు పెట్టేందుకు త్యాగి శంకరలింగనార్ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాదురై అసెంబ్లీలో తీర్మానం పెట్టి తమిళనాడు అని పేరు పెట్టారని విజయ్ గుర్తు చేశారు. ఈ సందర్భంలో తమిళనాడు కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకుందామని, తమిళనాడు అవతరణ దినోత్సవాన్ని చారిత్రక స్మృతులతో కీర్తిద్దామంటూ విజయ్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version