Latest Updates

రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న అమితాబ్ బచ్చన్..

టాటా గ్రూప్ సంస్థల గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఇటీవల మరణించారు. ఆయనకు ఎంతో కోట్ల ఆస్తులు ఉన్నా, ఆయన ఎంత సాదాసీదాగా జీవించారో దేశం మొత్తం చూశింది. అయితే రతన్ టాటాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. గతంలో రతన్ టాటా తన వద్ద అప్పు తీసుకున్నారని తెలిపారు. అంత డబ్బులు ఉన్నా సొంత కారు లేకుండా ఆయన జీవించిన గొప్ప వ్యక్తి అని అమితాబ్ అన్నారు.

పేరు, డబ్బు ఎంత సంపాదించినా.. సామాన్య వ్యక్తి లాగే జీవించిన గొప్ప మనసు కొందరికే ఉంటుంది. అలాంటి వారిలో ఇటీవల కన్నుమూసిన టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలాంటి రతన్ టాటా గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతి సాధారణమైన జీవితాన్ని గడిపి రతన్ టాటా చాలా మందికి ప్రేరణ ఇచ్చారు. ఆయన మరణించిన తర్వాత, రతన్ టాటాతో ఉన్న సంబంధాన్ని చాలా మంది ప్రముఖులు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీవీ షోలో బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్.. రతన్ టాటా గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని అమితాబ్ బచ్చన్ వివరించారు.
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16లో, ఇటీవల జరిగిన ఒక ఎపిసోడ్‌లో బాలీవుడ్ దర్శకుడు ఫరాఖాన్ మరియు హీరో బొమన్ ఇరానీ పాల్గొన్నారు.ఈ క్రమంలోనే రతన్ టాటా గురించి వచ్చిన ప్రస్తావనతో ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఒకసారి తాను, రతన్ టాటా ఒకే విమానంలో లండన్‌‌కు కలిసి వెళ్లినట్లు తెలిపారు. ” లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత, రతన్ టాటాకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారు కనిపించలేదు. అందువల్ల, వారికి ఫోన్ చేయడానికి రతన్ టాటా సమీపంలోని ఫోన్ బూత్‌కు వెళ్లారు. ఆ పక్కనే తాను నిలబడి ఉన్నాను. ఆ తర్వాత నా వద్దకు రతన్ టాటా వచ్చారు. అమితాబ్.. నేను మీ దగ్గరి నుంచి కొంత డబ్బు తీసుకోవచ్చా. ఫోన్ చేయడానికి నా వద్ద నగదు లేదు అన్నారు” అని అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.

ఇక రతన్ టాటా నిరాడంబరతను చూపించే మరో సంఘటనను అమితాబ్ బచ్చన్ చెప్పారు. తాను, తన స్నేహితుడు ఇద్దరూ కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లామని, ఆ ఈవెంట్‌కు రతన్ టాటా కూడా వచ్చారని చెప్పారు. ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత.. తన స్నేహితుడి వద్దకు వచ్చిన రతన్ టాటా.. తాను అతడి ఇంటి వెనుకాలే ఉంటానని.. ఆయనను తన ఇంటి వద్ద దింపగలరా అంటూ తన స్నేహితుడిని రతన్ టాటా కోరినట్లు అమితాబ్ బచ్చన్ వివరించారు. ఈ సందర్భంగా తనకు కారు లేదని రతన్ టాటా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇది మనం ఊహించగలమా అని అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ, ఫరాఖాన్ మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించిన ఏత్బార్ సినిమా టాటా సంస్థ నిర్మించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయవంతం కాలేదు. ఈ చిత్రం ద్వారా టాటా సంస్థకు రూ.3.5 కోట్ల నష్టం వచ్చిందని అమితాబ్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version