Latest Updates
సుప్రీంకోర్టు నూతన సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు నూతన సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 2019 జనవరిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఖన్నా, ఈ ఆరేళ్లలో దాదాపు 450కిపైగా తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ఉప-రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
2019 జనవరి 18న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్ సంజీవ్ సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్న వ్యక్తి.
తీస్‌హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో లాయర్‌గా ప్రాక్టీస్ చేసి.. మొదటిసారి. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టుకూ చీఫ్ జస్టిస్‌గా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది న్యాయమూర్తిల్లో జస్టిస్ ఖన్నా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు ఆయన స్వయానా సోదరుడి కుమారుడు. ముఖ్యమైన రాజ్యాంగసంబంధ కేసుల్లో పెదనాన్న జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్ఫూర్తిపొంది న్యాయవాద వృత్తివైపే మొగ్గుచూపారు.