Devotional

Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..

Lalbaugcha Raja

: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద.. రూ.5.65 కోట్ల నగదు, 4 కిలోల బంగారం, 64 కిలోల వెండి

Lalbaugcha Raja: వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి. 9 రోజుల పాటు పూజలు అందుకుని చివరి రోజు లడ్డూ వేలం పాటలు, డ్యాన్సులు, డీజేలు, డప్పు చప్పుళ్లతో గణనాథుడిని గంగమ్మలో నిమజ్జనం చేశారు. అయితే కొన్నిచోట్ల గణనాథులకు భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా కోట్ల కొద్ది డబ్బు, కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు వచ్చాయి. ఇంతకీ అది ఎక్కడ. అంత ఆదాయం ఎలా సమకూరిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా అత్యంత అంగరంగ వైభవంగా గణేష్ చతుర్థి, వినాయక నవరాత్రోత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరాడు. 10 రోజుల పాటు రకరకాల పూజలు, సేవలు, భజనలు, కీర్తనలతో దేశం మొత్తం మారుమోగగా.. ఇప్పుడు అంతా మూగబోయింది. ఉదయం సాయంత్రం వినాయకుడి మండపాల వద్ద పూజలు, ప్రసాదాలతో కళకళలాడేది. ఇప్పుడు అవన్నీ మాయం అయిపోయాయి. ఇక నిమజ్జనం తర్వాత గణనాథుడికి వచ్చిన విరాళాలు, హుండీ ఆదాయం, నగలు, ఆభరణాల లెక్కింపును వినాయక మండపం నిర్వాహకులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్‌బాగ్చా రాజా గణపతికి వచ్చిన ఆదాయం చూస్తే కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి.

దేశంలోనే అత్యంత ప్రముఖమైన లాల్‌బాగ్చా రాజా వినాయకుడికి ఈ ఏడాది కూడా భారీగా విరాళాలు వెల్లువెత్తాయి. 10 రోజుల గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏకంగా నగదు రూపంలోనే రూ.5.65 కోట్లు సమకూరాయి. అదే సమయంలో 4.15 కిలోల బంగారు ఆభరణాలను భక్తులు స్వామి వారికి సమర్పించారు. మరోవైపు.. 64.32 కిలోల వెండి ఆభరణాలను కూడా ఆ గణేషుడికి సమర్పించారు. వీటితో పాటు ఇతర వస్తువులను కూడా భక్తులు కానుకల రూపంలో అందించారు. ఈ ఏడాదికి సంబంధించి లాల్‌బాగ్చా రాజా గణపతికి వచ్చిన విరాళాలకు సంబంధించి లెక్కలు పూర్తి చేసిన లాల్‌బాగ్చా రాజా ఉత్సవ కమిటీ తాజాగా వివరాలను వెల్లడించింది. ఇంకా స్వామికి వచ్చిన ఇతర చిన్న చిన్న కానుకలను వేలం వేయనున్నట్లు తెలిపింది.

ముంబైలో ఎంతో ఫేమస్ అయిన ఈ లాల్‌బాగ్చా రాజా దర్శనానికి ఏటా గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. సామాన్య భక్తులే కాకుండా బిజినెస్‌మెన్‌లు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వచ్చి లాల్‌బాగ్చా రాజా వినాయకుడిని దర్శించుకుంటారు. ఈ లాల్‌బాగ్చా రాజా గణేషుడిని 1934 నుంచి.. పుత్లాబై చావల్ ప్రాంతంలోని లాల్‌బాగ్చా రాజా సార్వజనిక్ గణేశోత్సవ్ మండల్‌లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ లాల్‌బాగ్చా రాజా వినాయకుడి నిర్వహణ బాధ్యతలను కాంబ్లీ కుటుంబం.. గత 80 ఏళ్లకు పైగా చూసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version