Latest Updates
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైలు మార్గం ప్రారంభం.. ఈ మార్గంపై 20 ఏళ్లుగా వారు ఎదురు చూస్తున్నారు!

ఉత్తరాంధ్రవాసుల 20 ఏళ్ల కలగా ఉన్న రైలు మార్గం కోసం ముందడుగులు పడుతున్నాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి రిక్వెస్ట్ చేయగా.. రైల్వే అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. కచ్చితంగా సానుకూలమైన నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రైలు మార్గం ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి ప్రతిపాదనలుగా ఉన్న ఉత్తరాంధ్ర–ఒడిశా రైలు మార్గం ఏర్పాటుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిసి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిశారు. ఉత్తరాంధ్ర–ఒడిశా రైలుమార్గం ఏర్పాటు చేయాలని విన్నవించారు.. ఈ క్రమంలో రైల్వేశాఖ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర–ఒడిశా కొత్త రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఈ ఉత్తరాంధ్ర–ఒడిశా కొత్త రైలు మార్గాన్ని ప్రధానంగా గిరిజన ప్రాంతాలను కలిపేలా ప్రతిపాదించారు. అంటే చీపురుపల్లి, రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు, అలాగే ఒడిశాలోని పర్లాఖిమిడి ప్రాంతాలను కలిపి మెళియాపుట్టి నుంచి పలాస లైన్కు కలుపుతారని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే రవాణా సులభం అవుతుందని అంటున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా వరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉందంటున్నారు. అదే కాకుండా గిరిజన ప్రాంతాల నుంచి ఒడిశా వైపు వెళ్లాలంటే బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది, ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. రైలు మార్గం ఉంటే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు.
ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఏపీ–ఒడిశా మధ్య అంతర్రాష్ట్ర వ్యాపారాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకుకూడా ఉపాధి అవకాశాలు ఉంటాయంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఉత్తాంధ్రకు కీలకమైన ఈ రైలు మార్గంపై కేంద్రానికి విన్నవించారు.. త్వరలోనే ఈ రైలు మార్గంపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కొత్త రైలు మార్గంపై చొరవ చూపడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతున్నారు స్థానికులు.
గిరిజన ప్రాంతాలను కలుపుతూ.. కొత్త రైలు మార్గం ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి రావడం ఆనందంగా ఉందంటున్నారు. గిరిజనులు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉంటుందని.. కేంద్రం త్వరగా నూతన రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఉత్తరాంధ్ర–ఒడిశా కొత్త రైలు మార్గంపై తొలి అడుగు పడింది అన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. 20 ఏళ్లుగా ఇక్కడ ప్రజలు కోరుతున్నా అడుగులు ముందుకు పడలేదని.. ఇప్పుడు కేంద్రం నుంచి సాధించుకునే అవకాశం ఉండడంతో.. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారిద్దరూ వెంటనే స్పందించి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఆనందంగా ఉందని చెప్పారు. త్వరలో ఈ కొత్త రైలు మార్గంపై శుభవార్త ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.