Connect with us

Sports

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ విజయం..

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత మహిళల జట్టు విజయంతో బోణీ కొట్టింది. ఈ ప్రపంచకప్‌లో తన రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే పాకిస్థాన్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. ఈ టోర్నీలో భారత్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. న్యూజిలాండ్‌ చేతిలో 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే పాకిస్థాన్‌పై విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. దాంతో ఈ మ్యాచ్ గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది.

దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ మహిళల జట్టు.. భారత బౌలర్ల ధాటికి 105/8కే పరిమితమైంది. అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయంక పాటిల్‌ 2 వికెట్లతో పాకిస్థాన్ని పడ్డగొట్టారు. దీంతో ప్రత్యర్థి జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 71/7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరకు 100 పరుగుల మార్కును పాకిస్తాన్ ఎలాగోలా దాటింది.

ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఆచీతూచీ మెల్లగా బ్యాటింగ్ చేసింది. అయితే ఐదో ఓవర్‌లోనే స్మృతి మంధాన (16 బంతుల్లో 7 రన్స్‌ కే) ఔట్‌ అయింది. ఇక మరో ఓపెనర్ షెఫాలీ వర్మ నిదానంగా బ్యాటింగ్ చేయడంతో భారత్‌.. కాస్త ఒత్తిడిలో పడిపోయింది. కానీ కొట్టాల్సిన పరుగులు ఎక్కువగా లేకపోవడంతో ఆ తర్వాత చిన్నగా స్కోరు వేగాన్ని పెంచింది. షెఫాలీ వర్మ (35 బంతులు ఆడి 32 రన్స్‌ చేసింది), జెమీమీ రోడ్రిగ్స్‌ (28 బంతులు ఆడి 23 రన్స్ చేసింది). ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ 24 బంతులు ఆడి 29 రన్స్‌ చేసి రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సజన తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌ కొట్టి ముగించింది. దీంతో భారత్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది.

ఇక ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి భారీగా నెట్‌రన్‌రేట్‌ కోల్పోయిన భారత్.. ఈ విజయంతో కాస్త ఉపశమనం పొందింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 9న శ్రీలంకతో తలపడనుంది. ఆ తర్వాత లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ అక్టోబర్‌ 13న జరగనుంది. భారత్ బరిలోకి దిగిన గ్రూప్‌-Aలో సెమీస్‌ బెర్తు కోసం పోటీ తీవ్రంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లోనూ భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే.

అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మ్యాచ్ గురించి తెలుసుకునేందుకు పది లక్షల మందికిగా పైగా ప్రజలు గూగుల్‌లో వెతికారు. దాద్రా నగర్ హవేలీ, ఒడిశా, జమ్మూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, డామన్ డయ్యూ తదితర ప్రాంతాల ప్రజలు ఈ మ్యాచ్ గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు.

Loading