Telangana

HYDRA Demolitions: హైడ్రా గురించి ఆనాడే చెప్పిన కేసీఆర్

HYDRA Demolitions: హైడ్రా గురించి ఆనాడే చెప్పిన కేసీఆర్.. 28 వేల నిర్మాణాల కూల్చివేతకు ఫ్లయింగ్ స్క్వాడ్స్

HYDRA Demolitions: హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ మొత్తం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కొందరు ఈ హైడ్రా కూల్చివేతలకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తలు కురిపిస్తుండగా.. బాధితులు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హైడ్రా లాంటి వ్యవస్థ గురించి అప్పుడే కేసీఆర్ మాట్లాడారని కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు.

HYDRA Demolitions: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలను అమలు చేయాలని అధికార పార్టీ నేతలు కోరుతుండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేవలం కొన్ని అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారుతోంది. పొరుగున ఉన్న రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలో కూడా హైడ్రా తరహా లాంటి వ్యవస్థలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ పార్టీ.. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే గతంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అక్రమ నిర్మాణాలు, వాటి కూల్చివేతలపై మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

గతంలో హైదరాబాద్‌లో వరదలు సంభవించిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. నాలాలపై ఆక్రమణలు, నగరంలో అక్రమ కట్టడాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొ్న్నారు. అంతేకాకుండా చెరువులు, వర్షం నీరు ప్రవహించే నాలాలపై నిర్మించిన 28 వేల అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి వాటిని గుర్తించేందుకు జోనల్ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ కూడా ఏర్పాటు చేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు.

అదే సమయంలో మీడియాకు కూడా కేసీఆర్ ఒక విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చి వేసే సమయంలో మీడియా సహకారం ఉండాలని కోరారు. నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల వర్షం నీరు బయటికి పోకుండా ఉండి.. వరదలకు కారణం అయిందని.. భవిష్యత్‌లో హైదరాబాద్ నగరానికి వరదలు రాకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించాలని అప్పుడే కేసీఆర్ తెలిపారు. నాలాల ఆక్రమణపై దయ లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను అనుమతించమని తేల్చి చెప్పారు. ఇలా అక్రమ నిర్మాణాలు జరిపి ఆస్తులను కోల్పోవద్దని ఆ సమయంలో ప్రజలకు హితవు పలికారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version