Telangana
Kukatpally Hostel: హాస్టల్‌లో చెత్త పనులు.. పైగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..

అసలు చేసేదేమో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. కానీ వాళ్లు వెలగబెడుతున్న అసలు మ్యాటర్ వేరే ఉంది. అది కూడా ఉంటున్న హాస్టల్‌లోనే దుకాణం పెట్టేశారు. అసలు వాళ్లు వెలగబెడుతున్న యవ్వారమేంటనేగా మీ డౌటనుమానం. అదేనండి గంజాయి దందా. హైదరాబాద్‌లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. KPHB కాలనీలోని ఓ PG హాస్టల్లో ఉంటూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న నలుగురు యువకులు మాదకద్రవ్యాలు అమ్ముతుండగా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు.
వాళ్లకు అందిన సమాచారం మేరకు.. ఎస్ఓటీ పోలీసులు ఆ యువకులపై కాస్త నిఘా పెట్టారు. ఇంకేముంది సరిగ్గా మాదకద్రవ్యాలు అమ్ముతున్న సమయంలో హాస్టల్‌పై దాడి చేసి.. రెడ్ హ్యాండెడ్‌గా ఆ నలుగురు యువకులను పట్టుకున్నారు. ఈ దాడిలో.. వారి గదిలో 1600 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. ఆ గంజాయితో పాటు వారి దగ్గరి నుంచి 4 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని వారు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు.. ఎవరెవరికి అమ్ముతున్నారు.. ఎంత కాలం నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారన్నది నిందితుల నుంచి కూపీ లాగుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో.. ఎస్సార్ నగర్‌లోని కొన్ని హాస్టల్స్‌లో గంజాయి, డ్రగ్స్ దొరకటం కలకలం రేపింది. ఎస్సార్ నగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్‌లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి సుమారు 12 లక్షలు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేస్తుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. వాళ్ళు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఓకవైపు… డ్రగ్స్ ఫ్రీ సిటీగా, డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర స్థాయిలో కష్ట పడుతుంటే.. అలానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే.. డ్రగ్స్ మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడికక్కడ తనీఖీలు నిర్వహిస్తున్నా.. పట్టుబడ్డ దగ్గరి నుంచి కూపీలు లాగుతున్నా.. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. ఈ మాదకద్రవ్యాల సరఫరా మాత్రం ఆగకపోవటం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే.. మాదక ద్రవ్యాలు వాడుతున్నవారిలో ఎక్కువ శాతం విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఉండటం ఆందోళనకరంగా ఉంది.