Connect with us

Andhra Pradesh

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సమన్లు.. కోర్టుకు హాజరుకావాలని నోటీసులు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. ఓ లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ఆ పిల్‌ను స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు.. ఆయనకు సమన్లు జారీ చేసింది. పవన్ కళ్యాణ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు పంపించింది. ఆమెను కూడా వచ్చే నెలలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తేల్చి చెప్పింది.

తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉన్నట్లు.. గత ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టీటీడీ పంపించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. లాయర్ ఇమ్మనేని రామారావు.. కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఆ పిల్‌ను విచారణకు అంగీకరించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై. రేణుక.. విచారణ జరిపి.. పవన్ కళ్యాణ్, సీఎస్ శాంతి కుమారిలకు సమన్లు జారీ చేసింది.

ఇక నవంబర్ 22వ తేదీన పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని కోర్టు నోటీసుల్లో తెలిపింది. అదే సమయంలో తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‍సైట్లు తో సహా అన్ని ప్లాట్‌ఫామ్స్‌ నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మించిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లక్ష లడ్డూలను ప్రసాదంగా పంపించారు. అయితే ఆ లడ్డూలు కూడా కల్తీ అయ్యాయని.. కల్తీ లడ్డూలను అయోధ్య రాముడికి పంపించారని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు.

Loading