Telangana
14 నర్సింగ్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు – నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలలకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని 14 నర్సింగ్ కాలేజీలకు వైద్య విద్య సంచాలకుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటిలో కొన్ని కళాశాలలు ప్రభుత్వం అనుమతించిన ప్రాంతాల్లో కాకుండా వేరే చోట్ల నడుస్తుండగా, మరికొన్ని కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి, నివేదిక సమర్పించారు.
ప్రభుత్వానికి గత కొన్నాళ్లుగా నర్సింగ్ కాలేజీల పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పలు కాలేజీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. మొత్తం 23 నర్సింగ్ స్కూల్స్‌పై ఫిర్యాదులు అందడంతో 46 మంది అధికారులు రెండు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల అనంతరం 14 కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి, వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ నర్సింగ్ కాలేజీల్లో 7 సంస్థలు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో నడుస్తుండగా, మిగతా 7 కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులు లేని విషయం వెలుగుచూసింది. ఈ అంశాలపై రూపొందించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
అకడమిక్ డీఎంఈ మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆదేశాల మేరకు అధిక ఫిర్యాదులు అందిన 23 నర్సింగ్ స్కూల్స్‌లో తనిఖీలు నిర్వహించాం. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల సంఖ్య, మరియు అనుమతి పొందిన ప్రాంతంలోనే విద్యాసంస్థలు నడుస్తున్నాయా అనే అంశాలను పరిశీలించాము. ఈ నివేదికల ఆధారంగా చర్యలు తప్పవు” అని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.