Business
HDFC బ్యాంక్ రుణ వడ్డీ రేట్లలో తగ్గింపు
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ HDFC తమ రుణ వడ్డీ రేట్లలో స్వల్ప తగ్గింపుని ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను బ్యాంక్ 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ మార్పుతో రుణాలపై వడ్డీ రేట్లు రుణకాలం ప్రకారం 8.55% నుంచి 8.75% మధ్య ఉండనున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, బ్యాంకు ఓవర్‌నైట్ మరియు ఒక నెల MCLR ను 8.55%, మూడు నెలల MCLR ను 8.60%, ఆరు నెలల MCLR ను మరియు ఏడాది కాలానికి 8.65% గా నిర్ణయించింది. ఇక రెండు సంవత్సరాల కాలానికి వడ్డీ రేటు 8.70%, మూడు సంవత్సరాల రుణాలకు 8.75% గా ఉండనుంది. ఈ మార్పు వల్ల వినియోగదారులకు లోన్లపై స్వల్ప ఉపశమనం లభిస్తుంది.
ఇకపై HDFCలో హోమ్ లోన్ల వడ్డీ రేటు 7.90% నుంచి 13.20% మధ్య ఉండనుంది. రుణగ్రాహకులకు EMIలు తగ్గే అవకాశం ఉండటంతో గృహ రుణదారులు కొంత ఊరట పొందనున్నారు. బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదిగా భావిస్తున్నారు.