Telangana

మందు తాగే వారికి పెద్ద షాక్.. త్వరలో మద్యం ధరలు పెరగబోతున్నాయి..

మందుబాబులకు నిజంగా ఇది కిక్కు దిగిపోయే వార్తే. త్వరలో తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లిక్కర్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కార్.. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా మద్యం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తెలంగాణలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో లిక్కర్ ధరల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ ధరలను సగటున 20-25 శాతం పెంచే విధంగా సిద్దం చేస్తున్నారని సమాచారం. బీర్‌పై రూ.15–20, క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.10 -రూ.80 వరకు పెంచేలా ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ పెంపు ఉండగా, ఇతర బ్రాండ్లపై ఎక్కువ పెంచేలా సిద్దం చేస్తున్నారు. తద్వారా ప్రతినెలా రూ.500 కోట్ల నుంచి రూ.700 మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో సుమారు రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ సర్కార్ అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి 6 నెలల్లో ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.8,040 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్పారు. అంటే, మొదటి 6 నెలల్లో మొత్తం రూ.17,533 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో 6 నెలల్లో ఇదే స్థాయిలో ఆదాయం వచ్చినా, లక్ష్యం చేరుకోవడం కష్టం. ఈ కారణంగా, కొంచెం ధరలు పెంచి అదనపు ఆదాయం తెచ్చుకోవాలని సర్కార్ ఆలోచిస్తోంది.

తెలంగాణలో ఉన్న వైన్స్, బార్లు, క్లబ్బులు, పబ్‌ల ద్వారా రోజుకి సగటున రూ.90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకి సుమారు రూ.2,700 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ రేట్లు పెంచితే ఆ ఆదాయనికి తోడు.. ప్రతి నెలా దాదాపు రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

https://youtu.be/BgdBYkRJ1JY?si=G0VZ8cvfrhABsnYK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version