Latest Updates

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బావ మురసోలి సెల్వం మరణించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బావ మురసోలి సెల్వం మరణించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి మేనల్లుడు మురసోలి సెల్వం గురువారం బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందారు. ఈ దుఃఖవార్త తెలియగానే, సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. వెంటనే బెంగళూరుకు వెళ్లారు. అక్కడ మురసోలి సెల్వం భౌతిక దేహానికి నివాళులు అర్పించిన స్టాలిన్, భావోద్వేగానికి లోనై పార్థీవ దేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. 85 ఏళ్ల మురసోలి సెల్వం, గతంలో ప్రముఖ తమిళ దినపత్రిక మురసోలి ఎడిటర్‌గా సేవలందించారు.

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మేనల్లుడైన మురసోలి సెల్వం, కరుణానిధి కుమార్తె సెల్విని వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా, కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్‌కు స్వయానా మురసోలి సెల్వం తమ్ముడు. ఇక మురసోలి పత్రిక ద్రవిడ మున్నేట్ర కజగం-డీఎంకే పార్టీ అధికారిక వేదికగా ప్రసిద్ధి చెందింది. కరుణానిధి ఐడియాలను, జర్నలిజంలో మురసోలి సెల్వం చేసిన సేవలను ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీ గుర్తు చేసుకుంది. మురసోలి సెల్వం మరణం నేపథ్యంలో, డీఎంకే పార్టీ మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

మురసోలి సెల్వం తనకు చిన్నతనం నుంచే మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో ఆయన నుంచి సలహాలు, సూచనలు పొందేవాడినని, డీఎంకే అధినేతగా ఎదగడంలో మురసోలి సెల్వం తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. మురసోలి సెల్వం మరణం పట్ల చెన్నై ప్రెస్ క్లబ్ సంతాపం వ్యక్తం చేసింది. కరుణానిధి ఎప్పుడూ మురసోలి సెల్వంను తన మొదటి కుమారుడిగా భావించేవారని తెలిపారు.

కరుణానిధి ఆశయాలను, ఆలోచనలను మురసోలి సెల్వం ప్రజల్లోకి తీసుకెళ్లారని.. ప్రజస్వామ్యానికి వాయిస్‌గా నిలిచారని ఎంకే స్టాలిన్ ప్రశంసించారు. మురసోలి సెల్వం “సిలాంధి” (స్పైడర్) అనే కలం పేరుతో రచనలు చేస్తూ, తన ఆలోచనలను వ్యక్తపరిచేవారు. తన చివరి శ్వాస వరకు మురసోలి పత్రిక కోసం అహర్నిశలూ కృషి చేశారు. బుధవారం రాత్రి కూడా ఆయన ఒక కాలమ్ రాశారు. మురసోలి సెల్వంకు భార్య, కుమార్తె ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version