Telangana
హైదరాబాద్ వాసులకు మంచి వార్త.. నగరంలో మరో స్కైవాక్..

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా దేశీయ, విదేశీ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్నందున, మౌళిక వసతుల ఏర్పాటు మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలో కొత్త అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, రహదారులు నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో పెద్ద పుల్‌లు, అండర్‌పాస్‌లు నిర్మించింది. గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి సిద్ధమైంది.
అందులో భాగంగా నగరవాసులకు మరో శుభవార్త చెప్పింది. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రో రైలుస్థానం వద్ద కొత్తగా ఈ స్కైవాక్ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మెట్రో జంక్షన్‌గా ఈ స్టేషన్ నుంచి రోజూ చాలా మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళివస్తున్నారు. ఫ్లైఓవర్ కారణంగా ప్రస్తుతం స్టేషన్ నుంచి కిందికి వచ్చి రద్దీగా ఉండే రోడ్డు దాటాల్సివస్తోంది. అక్కడ అత్యంత రద్దీ ప్రాంతం కావడం.. రెండోవైపు ఎల్అండ్ టీ మెట్రోకు కేటాయించిన భూములు ఉండటంతో కనెక్టివిటీ కోసం స్కైవాక్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
నగరంలో వంతెనల ఉన్న చోట మెట్రో స్టేషన్లను రోడ్డుకు ఒక వైపు నిర్మించారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్‌ను ఇలాగే సికింద్రాబాద్ పీజీ కాలేజీ వైపు నిర్మించారు. రోడ్డు దాటి రెండొవైపు రావాలంటే ప్రయాణికులకు చాలా కష్టంగా ఉండేది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక్కడ స్కైవాక్ చేశారు. ఇదే మాదిరి పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద కూడా కొత్తగా మరో స్కైవాక్ నిర్మించబోతున్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికులు సులభంగా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది.
నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో తొలి డబులు డెక్కర్ కారిడారి నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం సైతం నిర్మించనున్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డువరకు 5.320 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ మార్గం నిర్మించబోతున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కి.మీ. కాగా.. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.