Telangana

CONGRESS COMPLAINTS ON FAKE NEWS ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు​ పెడితే జైలుకే!

సామాజిక మాధ్యమాలపై సర్కార్​ ఫోకస్ – ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు​ పెడితే జైలుకే! – CONGRESS COMPLAINTS ON FAKE NEWS

Congress Complaint on Social Media Handles : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులతోపాటు సర్కారుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని యూట్యూబ్‌ చానళ్లు వాస్తవ విరుద్ధమైన అంశాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వానికి అన్వయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ప్రభుత్వానికి జోడిస్తూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ చేస్తుండడంతో పలు వీడియోలపై కాంగ్రెస్‌ పార్టీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Congress Complaint on Social Media Handles : గతంలో ఎన్నడూ లేనివిధంగా సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చెరువులు, కుంటలు, కాలువలపై ఏర్పాటు చేసిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆక్రమణల తొలిగింపు, మూసీ ప్రక్షాళన కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని యూట్యూబ్‌ చానళ్ల ప్రతినిధులు బాధితుల అభిప్రాయాలను తీసుకొని, ఆవేశంతో బాధితులు మాట్లాడిన మాటలని ఎడిట్‌ చేయకుండానే సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

అలాంటి వీడియోలను ట్రెండింగ్​ చేస్తూ : మరికొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క వంటివారిపై వ్యక్తిగత విమర్శలుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీకి విలువ ఇవ్వకుండా నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం, దుర్భాషలాడడం వంటి వీడియోలని ట్రెండింగ్‌ చేయిస్తున్నారు. అలా చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమైనప్పుడు సామాజిక మాధ్యమాల్లోని వీడియోలపై చర్చించారు. అడ్డు అదుపులేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు పెడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను స్థానిక పరిస్థితులకు అన్వయిస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం శ్రుతిమించడంతో ప్రభుత్వం కఠినంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

విమర్శలు చేస్తున్నవారిపై చర్యలు : సామాజిక మాధ్యమాల్లో సీఎం, మంత్రులపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వాస్తవ విరుద్ధమైన అంశాలతో ప్రభుత్వంపై బురద జల్లడంపై అగ్రహంతో ఉంది. ఎవరైతే ప్రభుత్వంపై, సీఎం, మంత్రులపై విమర్శలు చేస్తున్నారో వారిపై కేసులు నమోదు చేయాలని సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్​ గౌడ్​ తెలిపారు.

కాంగ్రెస్‌ నాయకులు అందజేస్తున్న వీడియోల ఆధారంగా ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎక్స్‌ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్‌ అనే వ్యక్తిని కంచనబాగ్‌ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version