Telangana

CM Revanth reddy  రైతన్నకు సీఎం రేవంత్ దసరా కానుకలు

రైతన్నకు సర్కారు డబుల్ బోనస్  –  దసరా కానుకలు ఇవే! – CM Revanth on Paddy

వర్ష కాలం వరి నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ – ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు  జమ

ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు, తేమ పేరిట రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట కొత్త ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అవకతవకలు జరగకుoడా ఉండేలా చర్యలు  తీసుకోవాలని తెలిపారు. గురువారం ధాన్యం కొనుగోళ్లు, డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్​ నుంచే సన్న వడ్లకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్​కు రూ.500 బోనస్​ చెల్లిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కేంద్రానికి క్రమ సంఖ్య ఇవ్వాలని, సన్న వడ్ల కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. గోనె సంచులు అందుబాటులో పెట్టాలని తెలిపారు. వర్షాల వల్ల ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే తరలించాలని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు సూచనలను పాటిస్తూ ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెంటర్ : ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగస్వామ్యం కావాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు రోజూ రెండు గంటలు సమీక్షించాలని సీఎం రేవంత్​ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులు అందరూ సన్నబియ్యం పండించేలా అధికారులు చొరవ చూపించాలని ముఖ్యమంత్రి సూచించారు.

డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారం వరకు పూర్తి చేయాలని స్పష్టం చేసిన సీఎం, అక్టోబర్ 9న నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత వర్ష కాలం సీజన్​లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 140 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

రైతన్నలకు సీఎం రేవంత్ డబుల్​ బొనాంజా : సన్న వడ్లకు రూ.500 బోనస్​ ఇవ్వడమే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను 48 గంటల్లోనే అమ్మిన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. వీటితో పాటు దసరా కానుకగా రైతు భరోసా డబ్బులనూ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version