Andhra Pradesh
CM రేవంత్ పేరుతో బెదిరింపులు.. మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు, హైదరాబాద్‌లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లు, ర్యాపిడో, కంట్రీ డిలైట్ వంటి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారణ చేపట్టి, నాగరాజును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
గతంలో కూడా నాగరాజు మోసాలకు పాల్పడిన రికార్డు ఉంది. గత ఏడాది గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించాడు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పేండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడి అరెస్టయ్యాడు. ఈ ఘటనలో సీఎం పేరును దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడిన నాగరాజుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.