Business
రిలయన్స్ పెద్ద విలీనానికి సిద్ధమైంది. రూ. 70 వేల కోట్ల విలువ ఉన్న కొత్త కంపెనీ రూపొందుతోంది

రిలయన్స్ పెద్ద విలీనానికి సిద్ధమైంది. రూ. 70 వేల కోట్ల విలువ ఉన్న కొత్త కంపెనీ రూపొందుతోంది. ఈ కంపెనీకి నీతా అంబానీ బాస్‌గా ఉంటారు.
భారతీయ మీడియా రంగంలో పెద్ద విలీనానికి రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా వ్యాపారాలు మరియు వాల్ట్ డిస్నీ ఇండియా బిజినెస్ త్వరలో విలీనం కానున్నాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆమోదం ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరికి ఈ విలీనం పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్త జాయింట్ వెంచర్‌కి నీతా అంబానీ బాస్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
Reliance Disney Joint Venture: భారత అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. వాల్ట్ డిస్నీ మధ్య భారీ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఈ డీల్ ద్వారా భారత మీడియా, వ్యాపార రంగంలో కొత్త శకానికి నాంది పలికినట్టయింది. మీడియా రంగంలో ఇదే అతిపెద్ద విలీనం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన మీడియా వ్యాపారాలు, వాల్ట్ డిస్నీ ఇండియా వ్యాపారం కలిసి ఒకటవుతున్నాయి. ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చినట్టుగా, 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివర్లో ఈ డీల్ పూర్తవుతుందని వెల్లడించారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వివరాలను ఇటీవల రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వయాకామ్ 18, డిస్నీ స్టార్ ఇండియా కలిసి విలీనం కానున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా దీనికి అంగీకారం తెలిపింది. రిలయన్స్ టీవీ18 బ్రాడ్కాస్ట్, E18.. నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కలిసి అక్టోబర్ 3న అనుమతి ఇచ్చింది NCLT. ఇదే సమయంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా సంస్థల నేతృత్వంలోని నాన్ న్యూస్, కరెంట్ అఫైర్స్ టీవీ ఛానెల్స్ లైసెన్స్‌ను స్టార్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27నే అంగీకారం కూడా తెలిపింది.
ఇప్పుడు రెండు పార్టీలు కూడా విలీన ప్రక్రియలో తుది దశకు వచ్చాయని తెలుస్తోంది. సీసీఐ సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా.. తమ విలీన ఒప్పందంలో చేయాల్సిన మార్పుల్ని చేస్తున్నట్లు సమాచారం. NCLT ఈ విలీన ప్రతిపాదనకు ఆగస్ట్ 30న అంగీకారం తెలిపింది. దీని ప్రకారం, వయాకామ్ 18, జియో సినిమా మీడియా ఆపరేషన్స్.. డిజిటల్ 18కి వెళ్లనున్నాయి.
ఈ విలీనంతో భారత్‌లోనే అతిపెద్ద మీడియా సమ్మేళనంగా రిలయన్స్–వాల్ట్ డిస్నీ ఉంటుంది.ఈ జాయింట్ వెంచర్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ. 70 వేల కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. ఇక దీని కింద మొత్తం 120 టెలివిజన్ ఛానెళ్లతో రెండు స్ట్రీమింగ్ సర్వీసుల్ని కలిగి ఉండనున్నాయి. అతిపెద్ద మీడియా సంస్థగా అవతరిస్తుంది. ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థల వాటా 63.16 శాతంగా ఉండనుండగా.. వాల్ట్ డిస్నీ వాటా 36.84 శాతం. రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఈ కొత్త సంస్థలో రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ జాయింట్ వెంచర్‌కు నాయకత్వం వహిస్తారని, ఉదయ్ శంకర్ వైస్ ఛైర్పర్సన్ అవుతారని తెలుస్తోంది.