Telangana
Bus Accident Video: తాండూర్ రూట్లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం — షాకింగ్ వీడియో వైరల్
చేవెళ్ల సమీపంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన బస్సు ప్రమాదం మరువక ముందే, అదే తాండూర్ రూట్లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని కరణ్‌కోట్ మండల పరిధిలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు సహాయక చర్యలకు దిగారు. గాయపడిన డ్రైవర్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, బస్సు మరియు లారీని క్రేన్ సహాయంతో రోడ్డుపక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు కర్ణాటక రాష్ట్రానికి చెందినవేనని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు భద్రతా చర్యలపై అధికారులు సమీక్ష చేపడుతున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను అక్కడున్న కొంతమంది ప్రయాణికులు, స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో వేగంగా వైరల్ అవుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాన్ని పెంచుతున్నాయి.
![]()
