Telangana

మంచిర్యాల జిల్లాలో వింత సంఘటన.. బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుందా..?

సమాజంలో కొన్ని అసాధారణ ఘటనలు జరగటం చూస్తుంటే.. ఆశ్చర్యం వేస్తుంది. మరి కొన్ని సంఘటనలు చూస్తుంటే.. పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పింది అక్షరాలా నిజమవుతోందా.. అన్న అనుమానం వస్తుంది. అచ్చంగా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామస్థులు. ఎల్లక్కపేట గ్రామంలో జరిగిన ఈ ఘటన.. అలనాటి ‘సప్తపది’ సినిమా పాటలోని “తెల్లావు కడుపునా ఎర్రావు పుట్టదా..? కర్రావు కడుపునా తెల్లావు పుట్టదా..?” లిరిక్స్‌ను గుర్తు వచ్చేలా చేస్తున్నాయి. తెల్లని ఆవులకు నల్లటి దూడలు పుట్టటం సర్వసాధారణం కానీ.. నల్లని గేదేకు తెల్ల రంగున్న దూడ పుట్టడమనేది అత్యంత అరుదు. ఎల్లక్కపేటలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుని.. అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.

ఎల్లక్కపేట గ్రామానికి చెందిన దండ్ల సతీష్ అనే రైతు దగ్గరున్న ఓ గేదె.. నిన్న (అక్టోబర్ 29న) తెల్లని దూడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి గేదే ఏమో పూర్తిగా నల్లగా ఉండగా.. పుట్టిన దూడ మాత్రం పూర్తిగా తెల్లటి రంగులో ఉండటం అక్కడ సర్వత్రా ఆసక్తికర విషయంగా మారింది. తమ గేదే తెల్లని దూడకు జన్మనివ్వటంతో ఆ రైతు కుటుంబం ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా.. గ్రామమంతా వ్యాపించింది. దీంతో.. ఈ వింతను చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు.

అయితే.. ఈ వింత ఘటనను చూసి గ్రామస్థులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు నల్లని గేదేలు చూశాం కానీ.. ఇలా తెల్లటి గేదెలు చూడటం ఇదే మొదటిసారి అని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన చూస్తుంటే.. పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం నిజమవుతోందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వెలుగుచూస్తున్న వింత ఘటనలతో.. యుగాంతానికి సమయం దగ్గరపడిందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పశువు వైదుడ్ని సంప్రదిస్తే మాత్రం.. దీనికి వైద్యపరమైన కారణాలు చెప్తున్నారు. ఇది జన్యుపరంగా జరిగే అరుదైన ఘటనగా పశువైద్యుడు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.

ఇటీవలే.. జగిత్యాల జిల్లాలోని ఎండపల్లిలో ఏళ్లనాటి చింత చెట్టుకు కల్లు కారుతుండటం.. అదరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఘటన మరువక ముందే.. ఇప్పుడు ఈ తెల్ల దూడ విషయం వెలుగుచూడటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version