Andhra Pradesh

వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డిని వదిలేశారా..? సీఎం, డీజీపీ సీరియస్..!

వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు విడిచిపెట్టడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల తో సహా పలువురు విపక్ష నేతలపై వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టారని అతని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కడప పోలీసులు పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కడపకు తీసుకువచ్చి రహస్యంగా విచారించారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున 41A నోటీసులు ఇచ్చి వర్రా రవీందర్‌రెడ్డిని విడిచిపెట్టారు.

అయితే వర్రా రవీందర్‌రెడ్డిని అలా వదిలేయటంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కడప పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్రా రవీందర్‌ రెడ్డి కోసం గాలిస్తున్నారు. అయితే నోటీసులు అందుకుని బయటకు వచ్చిన వర్రా రవీందర్ రెడ్డి కనిపించకుండా పోయారు. నోటీసులు అందుకున్న తర్వాత అదృశ్యమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుతో సమావేశమయ్యి.. వర్రా రవీంద్రారెడ్డి కేసుపై ఆరాలు తీశారు.

మరోవైపు బుధవారం తెల్లవారుజామున వర్రా రవీందర్ రెడ్డికి 41ఏ కింద నోటీసులు ఇచ్చిన కడప పోలీసులు.. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని ఆదేశించారు. ఆ తర్వాత మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే వర్రా రవీందర్‌రెడ్డి మాయమైపోయారు. ఆయన కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వర్రా రవీందర్ రెడ్డి భార్య, సోదరుడు, మరదలను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. వేముల పోలీసులు వీరిని క‌డ‌ప రూర‌ల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కడప ఎస్పీ ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం. ఇక పోతే వర్రా రవీందర్‌ రెడ్డిపై మంగళగిరి, పులివెందుల, హైదరాబాద్‌లలో పలు కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version