Andhra Pradesh

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు రెండు రోజుల పాటు గడువు పెంపు..

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును ఇంకో రెండు రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ మార్చాలని ప్రభుత్వానికి పలువురు విఙప్తి చేసుకున్నారు. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసి, దరఖాస్తుల గడువును అక్టోబరు 11 వరకు పొడిగించింది. అలాగే ఆ రోజు రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం ఇస్తున్నట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు.

అక్టోబరు 12, 13 తేదీల్లో దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఈ నెల 14వ తేదీన కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపులకు లాటరీ తీయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక అదే రోజున లైసెన్స్‌లు కూడా మంజూరు చేస్తామని, 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుందని ఆయన చెప్పారు. మద్యం దుకాణాలకు పోటాపోటీగా దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 52 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా మద్ం షాపులను లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే అక్టోబరు 1 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేయవచ్చు. అయితే, దరఖాస్తు రుసుం రూ.2 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ తగిలినా.. లేకున్నా ఈ డబ్బును వెనక్కి ఇవ్వరు.

లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్లలో నిర్దేశించిన నగదును చెల్లిస్తే తక్షణమే15 రోజులకు సరిపడా లైసెన్సును మంజూరు చేస్తారు. కానీ, మద్యం షాపులను ఏర్పాటు చేసిన ప్రాంతాలను ఆయా సబ్‌-డివిజన్‌ల ఎక్సైజ్‌ సీఐలు పరిశీలిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఈ 15 రోజుల వ్యవధిలోనే పూర్తిస్థాయి లైసెన్సులను కూడా ఇస్తారు. ఇవి రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version