Andhra Pradesh

వైసీపీ మాజీ ఎంపీ మాధవ్‌‌ అసభ్యకరంగా.. పోక్సో కింద కేసు పెట్టాలని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

వైసీపీ మాజీ ఎంపీ మాధవ్‌‌ అసభ్యకరంగా.. పోక్సో కింద కేసు పెట్టాలని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మాధవ్ చేసిన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. అలాగే తన రాజకీయ భవిష్యత్‌పైనా వాసిరెడ్డి పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్ని పార్టీల్లో నేతలతో పరిచయాలు ఉన్నాయని.. త్వరలోనే తాను ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు.

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఏపీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను మాధవ్‌ బయటకు చెబుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును ఫిర్యాదులో కోరారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమన్నారు. అందుకే మాధవ్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అత్యాచార బాధితుల గురించి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయన్నారు. ఏదైనా ఘటన జరిగితే, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వాసిరెడ్డి పద్మ అన్నారు. కానీ ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్ బయటకు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు గురైన బాధితుల పేర్లు చెప్పి మాట్లాడటం దారుణమన్నారు. మహిళలపై, అత్యాచార బాధితులపై ఒక మాజీ ఎంపీ ఇలా అసభ్యంగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలన్నారు.

ఇలాంటి వారిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు పద్మ. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేయడం, ఇంకా తొలగించకపోవడం చూస్తే ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న నిబద్ధత ఏంటో అర్థం అవుతుందన్నారు. గోరంట్ల మాధవ్ మీద సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. వాసిరెడ్డి పద్మ తన రాజకీయ నిర్ణయం మరో వారం రోజుల్లో ప్రకటిస్తానన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) తమకు ఆప్తులని చెప్పారు. త్వరలో ఏ పార్టీలో చేరుతానో ప్రకటిస్తానని అన్నారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఆమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version