Telangana

మరో ఐఏఎస్‌కు తెలంగాణ నుంచి ఏపీలో పోస్టింగ్ కీలక బాధ్యతలు

మరో ఐఏఎస్‌కు తెలంగాణ నుంచి ఏపీలో పోస్టింగ్ కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. తెలంగాణ నుంచి వచ్చిన రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కె.కన్నబాబుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా బి.అనిల్ కుమార్ రెడ్డిని నియమించింది. గంధం చంద్రుడును కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. డి.హరితను వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొందరు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డీఓపీటీ ఆదేశాల ప్రకారం, తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి వచ్చిన రోనాల్డ్ రోస్‌కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ఆయన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్ నిర్వహణ, ఇన్‌స్టిట్యూషనల్ ఫైనాన్స్)గా నియమించారు. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న కె.కన్నబాబుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వం. ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న బి. అనిల్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆయన గత ప్రభుత్వంలో పాడా (పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ) ఓఎస్‌డీగా పనిచేశారు. ఇప్పటివరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఉన్న గంధం చంద్రుడిని కార్మిక, కర్మాగారాలు, బీమా, వైద్య సేవల శాఖ అదనపు కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం. అలాగే, హరితను వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ ఏడాది ఆగస్టులో హరితను అనంతపురం జేసీగా నియమించారు. తర్వాత ఆ పోస్టింగ్ రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డీఓపీటీ ఐఏఎస్‌ అధికారులను ఇటీవల ఆదేశించంది. ఈ ఉత్తర్వులపై క్యాట్, హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు.. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేశారు. ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి పోస్టింగ్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి, వైద్య ఆరోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించింది. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ముగ్గురు ఐఏఎస్‌లకు ఇప్పటి వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version