Andhra Pradesh

తిరుమల ప్రసాదంపై CM చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

తిరుమల శ్రీవారి లడ్డూ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందన్న చంద్రబాబు.. భక్తులకు నాసిరకం లడ్డూలు, నాణ్యతలేని అన్నప్రసాదం పంపిణీ చేసిందంటూ ఆరోపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయనేదీ చూడాల్సి ఉంది. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి స్థానంలో జె. శ్యామలరావును నియమించింది. ఇక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భక్తులు సౌకర్యాలు, ప్రసాదాల నాణ్యతపై ఈవో స్పెషల్ ఫోకస్ పెట్టారు. శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గడానికి నెయ్యే కారణమని గుర్తించిన ఈవో.. నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేయిస్తున్నారు.

ఇక నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయడం కోసం టీటీడీ నలుగురు ప్రముఖులతో నిపుణుల కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రస్తుతం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడెక్ట్ కంపెనీ నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నెయ్యినే తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో తిరుమల లడ్డూ నాణ్యత పెరిగిందని, రుచి బాగుందని భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్న విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ఇటీవల జరిగిన సమావేశంలో సైతం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version