Andhra Pradesh

AP Flood Donations: సీఎం రిలీఫ్ ఫండ్‌కు 400 కోట్లు..

ఏపీలో ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, వరదలు ఎంత నష్టం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా విజయవాడ వాసులకు వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం కూడా సంభవించింది. ఇక వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ సాయాన్ని అందించారు.

రంగాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ, విద్యాసంస్థల దగ్గర నుంచి వ్యాపార సంస్థల వరకూ, పిల్లల నుంచి పెద్దల వరకూ.. భారీగా విరాళాలు అందించారు. ఈ విరాళాల వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి సహాయనిధికి ఎంతమేరకు విరాళాలు వచ్చాయనేదీ వెల్లడించారు.

వరద బాధితులకు అండగా ఉండేందుకు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్లు విరాళాలు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. సాధారణ ప్రజలు, కార్పొరేట్లు, సంస్థలు ఇలా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సాయం అందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తే.. ఉద్యమ స్ఫూర్తితో కలిసి వచ్చారంటూ చంద్రబాబు అభినందించారు.

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళాలు రావటం ఒక చరిత్రగా అభివర్ణించిన చంద్రబాబు.. బాధితులను ఆదుకునే విషయంలో ఉద్యోగులు కూడా విశ్రాంతి లేకుండా పనిచేశారని వారిని ప్రశంసించారు. తాను కూడా బురదలోకి దిగి పనిచేశానని.. బాధితులకు అన్నివిధాలుగా సాయం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేసినట్లు చంద్రబాబు వివరించారు. వరదల కారణంగా ప్రభావితమైన నాలుగు లక్షల మందికి రూ.602 కోట్లు వారి ఖాతాల్లో జమచేస్తే.. అందులో రూ.400 కోట్లు విరాళాల రూపంలో వచ్చినవేనని చంద్రబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version