Entertainment
నా ఫ్యామిలీపై కొండా సురేఖ తప్పుడు వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున స్టేట్మెంట్

అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే.. కోర్టు ఆదేశాల మేరకు.. నేడు (అక్టోబర్ 08న) నాగార్జున గారు నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నాగార్జున వెంట.. ఆయన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో పాటు సుప్రియ, నాగ సుశీల, వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మంత్రి కొండా సురేఖపై ఎందుకు పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించింది. ఈ క్రమంలో.. నాగచైతన్య, సమంతల విడాకులపై, తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ధర్మాసనానికి నాగార్జున వివరించారు. ఈ క్రమంలో నాగార్జున స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది.
మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వకమైన తప్పుడు వ్యాఖ్యలు చేశారని కోర్టుకి నాగార్జున చెప్పారు. నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. సినీరంగంలో ఉన్నవారిపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదని నాగార్జున తెలిపారు.
అలానే సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి.. ఇక దేశ వ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు కూడా ఉన్నాయని కోర్టుకి నాగార్జున వివరించారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని కూడా తెలిపారు. సినిమా రంగంతో పాటు సామజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని నాగార్జున వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే తన కొడుకు విడాకులు తీసుకున్నాడంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని ధర్మాసనం ముందు నాగార్జు ఆవేదన వ్యక్తం చేశారు. అలా మాట్లాడం వల్ల తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని తెలిపారు.
రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ తమపై తప్పుడు ఆరోపణలు చేసిందని నాగార్జున ఆరోపించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ప్రసారమైందని ధర్మాసనానికి తెలిపారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును నాగార్జున కోరడం జరిగింది. ఈమేరకు నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. ఇక తదుపరి విచారణను ఎల్లుండి (అక్టోబర్ 10)కి వాయిదా వేసింది ధర్మాసం.