Tech

Airtel : ఎయిర్‌టెల్‌ యూజర్లకు ఇక నుంచి ఆ సర్వీస్‌ ఫ్రీ

Airtel on SPAM : టెలికాం యూజర్లను వేధిస్తున్న సమస్యను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో అడ్డుకునేందుకు ఎయిర్‌టెల్‌ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. వివరాల్లోకెళ్తే..

మొబైల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. ప్రస్తుతం ప్రతిరోజూ స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లతో విసిగిపోతుంటాం. అయితే.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) నడుంబిగించింది. కొన్నేళ్లుగా టెలికాం యూజర్లను తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో అడ్డుకునేందుకు కొత్త టెక్నాలజీని రూపొందించింది. రేపటి (సెప్టెంబర్ 26) నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ల గురించి ఈ సదుపాయం యూజర్లను అలెర్ట్ చేస్తుంది. స్పామ్‌ కాల్స్‌పై చర్యలు తీసుకుంటున్న తొలి నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్‌ అని ఆ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో 60 శాతం మంది భారతీయులు సగటున రోజుకు మూడు స్పామ్‌ కాల్స్‌ అందుకుంటున్నారని పేర్కొంది. వీటివల్ల టెలికాం యూజర్ల సమయం వృథా కావడంతో పాటు కొన్నిసార్లు స్కాములకు కూడా దారితీస్తున్నాయని తెలిపింది. వీటిని అడ్డుకొనే దిశగా ఎయిర్‌టెల్‌ ఈ ప్రయత్నం మొదలుపెట్టిందని స్పష్టం చేసింది. తమ ఏఐ ఆధారిత స్పామ్‌ డిటెక్షన్ సొల్యూషన్‌ కేవలం 2 మిల్లీ సెకన్లలోనే స్పామ్‌ను గుర్తించి యూజర్‌ను డైలర్‌పై అలర్ట్‌ చేస్తుందని స్పష్టం చేసింది. ప్రతి రోజు 1.5 బిలియన్ SMS, 2.5 బిలియన్‌ కాల్స్‌ ప్రాసెస్‌ చేస్తుందని చెప్పారు. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వాడే స్మార్ట్‌ఫోన్‌ యూజర్లందరికీ ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందించనున్నట్లు తెలిపింది.

అలాగే.. ఈ వ్యవస్థ SMSల ద్వారా వచ్చే URL లపైనా అప్రమత్తం చేస్తుందని అభిప్రాయపడింది. ఇందుకోసం అనుమానాస్పద, హాని చేసే URL లతో కూడిన డేటాబేస్‌ను రూపొందించినట్లు తెలిపింది. తద్వారా యూజర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని.. దీంతోపాటు IMEI నంబర్లలో తరచూ మార్పులను కూడా గమనిస్తుందని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version